fbpx
NEWS

జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏమిటి ….ప్రియాంక కేసు నేపథ్యంలో.

*ప్రియాంక కేసులో చర్చనీయాంశంగా జీరో ఎఫ్ఐఆర్!*

జీరో ఎఫ్‌ఐఆర్‌. ప్రియాంకరెడ్డి హత్య నేపథ్యంలో మరోసారి చర్చకు వచ్చిన అంశం. తమ పరిధి కాదంటూ పోలీసులు సమయం వృథా చేయడం, రెండు పోలీస్‌స్టేషన్ల చుట్టూ కుటుంబసభ్యులు తిరగడం ఇప్పుడు జీరో ఎఫ్‌ఐఆర్‌ వాదనను మరోసారి తెరపైకి తెచ్చింది. నేరాల నియంత్రణ, బాధితులకు సత్వర న్యాయం జీరో ఎఫ్‌ఐఆర్‌తో ఎంతో కొంత సాధ్యమవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

హైదరాబాద్‌ నగరంలో వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంకరెడ్డి అత్యంత పాశవికంగా అత్యాచారం, హత్యకు గురయ్యింది. ఆమె కనిపించకుండాపోవడం, సెల్‌ఫోన్‌ స్విచాఫ్‌ కావడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కానీ.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌, శంషాబాద్‌ రూరల్‌ పోలీసులు తమ పరిధి కాదంటే తమ పరిధి కాదని వాళ్లను తిప్పించారు. తర్వాత వివరాల సేకరణ పేరుతో చాలా సమయాన్ని వృథా చేశారు. కుటుంబ సభ్యులు ఇప్పుడు ఈ అంశాన్నే లేవనెత్తుతున్నారు. జాతీయ మహిళా కమిషన్‌ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లబోతున్నారు.

 

పోలీసు స్టేషన్ల హద్దుల వివాదం ఈనాటిది కాదు.. ఎన్నో ఏళ్లుగా నడుస్తున్నదే. బార్డర్‌లలో పోలీస్ స్టేషన్ల హద్దుల బోర్డులు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు నూటికి తొంబై తొమ్మిది శాతం అమలుకు నోచుకోవడం లేదు. ఇప్పుడు ప్రియాంక హత్యకేసు విషయంలోనూ ఇదే అంశం పోలీసులు ఆలస్యంగా స్పందించడానికి కారణమైంది. దుర్మార్గుల చేతుల్లో ఓ వైద్యురాలు ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది. మంబైలో జీరో ఎఫ్‌ఐఆర్‌ సదుపాయం ఉంది. అలాంటి సదుపాయాన్ని అంతర్జాతీయ స్థాయి నగరమైన హైదరాబాద్‌లోనూ అమలు చేస్తే ప్రియాంకరెడ్డి లాంటివాళ్లు ఆపదలో ఉన్నప్పుడు తోడ్పడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ప్రతి ఫిర్యాదుకూ పోలీస్‌స్టేషన్లలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి. ఎఫ్‌ఐఆర్‌కు విధిగా ఓ నెంబర్‌ వేయాలి. కానీ.. ఇప్పుడు జీరో ఎఫ్‌ఐఆర్‌ విధానంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. కొన్నేళ్లుగా ఈ అంశం చర్చకు వస్తున్నా ఉన్నతాధికారులు అటువైపుగా దృష్టి సారించడం లేదన్న ఆరోపణలున్నాయి.

ప్రయాణాల్లో, కొత్త ప్రదేశాల్లో తరచూ మోసాలు, నేరాలు జరుగుతున్నాయి. అమాయకులు నేరగాళ్ల ఉచ్చులో చిక్కుతున్నారు. వాళ్లలో ధైర్యం నింపాల్సిన, అండగా ఉండాల్సిన పోలీసులు.. తమ పరిధికాదని తప్పించుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో బాధితులు దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. జీరో ఎఫ్‌ఐఆర్‌ విధానం అమలు చేస్తే ఎలాంటి నేరమైనా.. ఎక్కడైనా ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంటుంది. ప్రతి ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు తప్పనిసరి అవుతుంది. ఆ తర్వాత ఎఫ్‌ఐఆర్‌ నమోదైన స్టేషన్‌నుంచి పోలీసులు సంబంధిత పోలీస్‌ స్టేషన్‌లను అలర్ట్‌ చేస్తారు. మొత్తానికి జీరో ఎఫ్‌ఐఆర్‌ అమల్లోకి వస్తే ఆ సదుపాయం బాధితులకు వరం కానుంది. ఇప్పటికే ముంబైలో జీరో ఎఫ్‌ఐఆర్‌ అమలులో ఉంది. తమ పరిధిలోకి రాని నేరాలపై ఏ పోలీస్‌స్టేషన్‌లోనైనా కేసులు పెట్టే అవకాశం ఉంది. అలాంటి ఫిర్యాదులపై ఎఫ్‌ఐఆర్‌ నెంబర్‌ లేకుండా కేసులు నమోదు చేస్తారు. ఆ తర్వాత పోలీసులు విజయవంతంగా కేసులు ఛేదిస్తున్నారు.

హైదరాబాద్‌లో జరిగిన పలు సంఘటనలు తరచూ జీరో ఎఫ్‌ఐఆర్‌ పై చర్చను లేవనెత్తుతున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ప్రస్తుతం మూడు కమిషనరేట్లు, వందకు పైగా పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి. మహానగరంలో ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఏదైనా మోసమో, నేరమో జరిగితే, ప్రియాంకరెడ్డి మాదిరిగా ఆపదలో ఉన్న సమయంలో పోలీస్‌స్టేషన్ల పరిధి తెలుసుకోవడం కష్టమవుతోంది. ఈ సమయంలో ఎక్కడ ఫిర్యాదు చేయాలన్నది బాధితులకు ఓ పజిల్‌గా మారుతోంది. దీనికి తోడు పోలీసుల వ్యవహారశైలి బాధితులకు ఆవేదన మిగులుస్తోంది.

దీనికి పోలీసులు చెబుతున్న కారణాలు కూడా విస్మరించే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రతి పోలీస్‌స్టేషన్‌కూ ఓ పరిధి ఉంటుంది. ఆ పరిధుల్లో జరిగిన నేరాలపైనే సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేయాల్సిఉంటుంది. లేకుంటే.. తర్వాత చట్టపరంగా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే పోలీసులు ఫిర్యాదులు వచ్చిన సమయంలో పరిధులను ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటారు. ఈ నిబంధనలు సామాన్యులకు ఇబ్బందికరంగా మారుతున్నాయి.

ముంబైలో ప్రస్తుతం అమలవుతున్న జీరో ఎఫ్‌ఐఆర్‌ విధానంలో.. బాధితుడు ఫిర్యాదు చేసిన వెంటనే ఎఫ్‌ఐఆర్‌ జారీచేస్తారు. సాధారణంగా ఎఫ్‌ఐఆర్‌కు ఓ నెంబర్‌ కేటాయిస్తారు. కానీ.. ఇలాంటి పరిధులకు సంబంధించిన ఫిర్యాదులకు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తారు. ఆ తర్వాత.. ఆకేసు ఏ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోకి వస్తుందో ఆ స్టేషన్‌కు బదలాయించి కేసు దర్యాప్తులో సహకారం అందిస్తారు.

దేశరాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ అత్యాచార ఉదంతం తర్వాత ప్రధానంగా జీరో ఎఫ్‌ఐఆర్‌పై దృష్టిసారించారు. అధికార పరిధి నెపంతో పోలీసులు నిర్భయ ఉదంతంలో తీవ్ర జాప్యం చేశారని, ఫిర్యాదు తీసుకునేందుకు కూడా తొలుత నిరాకరించారని ఆరోపణలువచ్చాయి. దీంతో.. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. నేరం జరిగినట్లు బాధితులు వచ్చిన వెంటనే మొదట ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని, ఆ తర్వాత సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు కేసును బదిలీ చేయాలని ఆదేశించింది. సంఘటన తమ పరిధిలో జరగలేదని స్పష్టంగా తెలిస్తే జీరో ఎఫ్‌ఐఆర్‌గా నమోదు చేసుకోవాలని తేల్చి చెప్పింది. లేకుంటే పోలీసులపైనా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

హైదరాబాద్‌లోనూ ఈ జీరో ఎఫ్‌ఐఆర్‌ విధానం అమలు చేయాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. టెక్నాలజీ కూడా అభివృద్ధి చెందిన నేపథ్యంలో.. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి ఈ కోణంలో దృష్టిపెట్టాలని, ఫలితంగా బాధితులకు అండగా నిలవాలన్న విజ్ఞప్తులు వస్తున్నాయి.