fbpx
Celebrities Entertainment TOLLYWOOD

తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్..!

బుల్లితెరపై 100 రోజులకు పైగా వినోదాన్ని పంచిన బిగ్ బాస్ మూడో సీజన్ ముగిసింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్‌లో రాహుల్‌ను విజేతగా ప్రకటించారు హోస్ట్ నాగార్జున. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రాహుల్ ట్రోఫీ అందుకున్నారు. అలాగే, రూ.50 లక్షల చెక్‌కు కూడా అందుకున్నారు.


అంతకు ముందు, హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు రవికృష్ణ, శివజ్యోతిల పెర్ఫార్మెన్స్‌తో షో మొదలైంది. ‘అల… వైకుంఠపురములో…’లోని రాములో రాములా సాంగ్‌కు వీరు పెర్ఫార్మ్ చేశారు. ఆ తరవాత రోహిణి, హేమ, హిమజ, శిల్పా చక్రవర్తి, వితికా, పునర్నవి, మహేష్ విట్ట, తమన్నా, జాఫర్.. వరుసగా ఒక్కొక్కరిగా, ఇద్దరు ముగ్గురుగా వేదికపైకి వచ్చి పెర్ఫార్మెన్స్ చేశారు. చివరిగా నాగార్జున అదరిపోయే ఎంట్రీ ఇచ్చారు. ఆయన సినిమాల్లోని పాటలను మిక్స్ చేసి స్టెప్పులతో ఇరగదీశారు.

ఇదిలా ఉంటే, కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 3 హంగామా జూలై 21 నుంచి ప్రారంభమైంది. మొత్తం 15 మంది సెలబ్రిటీలు బిగ్ హౌజ్‌లోకి అడుగుపెట్టారు. వీళ్లంతా టీవీ, సినిమా రంగాలకు చెందిన సెలబ్రిటీలే. గత సీజన్ మాదిరిగా ఈ సీజన్‌లో సాధారణ వ్యక్తులను తీసుకోలేదు.

కాబట్టి ఈసారి పోరు మరింత రసవత్తరంగా మారింది. 106 రోజులు నడిచిన ఈ రియాలిటీ షో ఆదివారం ముగిసింది. మొత్తం ఐదుగురు సభ్యులు.. శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, అలీ రెజాలు ఫైనల్‌కు చేరగా.. రాహుల్ విజేతగా నిలిచాడు.