fbpx
NEWS REVIEWS TOLLYWOOD

సమంత ‘ఓ బేబీ’ రివ్యూ & రేటింగ్

సినిమా: ఓ బేబీ
నటీనటులు: సమంత అక్కినేని, రాజేంద్ర ప్రసాద్, నాగశౌర్య, రావు రమేష్, లక్ష్మీ తదితరులు
సినిమాటోగ్రఫీ: రిచార్డ్ ప్రసాద్
సంగీతం: మిక్కీ జే మేయర్
నిర్మాణం: సురేష్ ప్రొడక్షన్స్
దర్శకత్వం: నందిని రెడ్డి

తెలుగు స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని నటించిన తొలి లేడీ ఓరియెంటెడ్ మూవీగా ‘ఓ బేబీ’ ఆడియెన్స్‌లలో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాపై మొదట్నుండీ చిత్ర యూనిట్ ధీమాగా ఉండటంతో ఈ సినిమా పట్ల ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఎంతమేర అందుకుందో రివ్యూలో చూద్దాం.

కథ:
బేబీ(లక్ష్మీ) ఓ చాదస్తపు ముసలావిడ. ఇంట్లో వారిని తన చాదస్తంతో చిరాకుపెట్టేది. తన కోడలి అనారోగ్యం కారణంగా బేబీ ఇల్లు వదిలేస్తుంది. హఠాత్తుగా బేబీ వయసు తగ్గిపోయి కొత్త బేబీ(సమంత)గా మారుతుంది. బేబీ పారిపోయిందని అనుకున్న తన కుటుంబంలోకి అద్దెకు దిగుతుంది కొత్త బేబీ. ఆ తరువాత తన కుటుంబం కోసం బేబీ ఏం చేసింది..? కుటుంబ సమస్యలను బేబీ తీరుస్తుందా..? బేబీ గురించి ఇంట్లో వాళ్లకు తెలుస్తుందా లేదా..? అనేది చిత్ర కథ.

విశ్లేషణ:
దర్శకురాలు నందిని రెడ్డి ఈ కథను ఓ కొరియన్ మూవీ నుండి తీసుకున్నట్లు గతంలోనే చెప్పింది. అయితే తెలుగు జనాలకు కనెక్ట్ అయ్యే విధంగా కొన్ని మార్పులు చేసి తెరకెక్కించిన ఈ సినిమాలో సమంత ముఖ్య పాత్ర పోషించింది. ఫస్టాఫ్‌లో కథలోని పాత్రలను ఇంట్రొడ్యూస్ చేయడం, వారి సమస్యలను తెలియజేయడంతోనే సరిపెట్టేసింది దర్శకురాలు. వాస్తవానికి దూరంగా ఉండే అంశాలను సినిమాలో చూపించడంతో కొన్ని సీన్స్ సినిమాపై ఆసక్తిని తగ్గించేస్తాయి. వృద్ధారులు పడుచుపిల్లగా మారడం అనేది జరగనిది. కానీ కొన్ని అంశాలను జోడించి ఈ సన్నివేశాన్ని చూపించిన విధానం కొంతమేర ఆడియెన్స్‌ను మెప్పిస్తుంది.

ఇక వయస్సు తగ్గిన బేబీ తన కుటుంబం కోసం చేసే పనులను చాలా చక్కగా చూపించారు దర్శకురాలు. ఈ క్రమంలో ఆమెను ప్రేమించే కుర్రాడిగా నాగశౌర్య, రాజేంద్రప్రసాద్‌తో బేబీ చేసే కామెడీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఓ వైపు తన కుటుంబం గురించే ఆలోచిస్తున్న బేబీకి కొన్ని ఘటనలు ఎదురుకావడం.. వాటిని ఆమె ఎలా పరిష్కరించిందనే అంశంతో సినిమా చివరి దశకు చేరుతుంది. ఓ చిన్న ట్విస్ట్‌తో సినిమా ముగుస్తుంది.

కేవలం ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్‌లకే పెద్దపీట వేసిన ఓ బేబీ కొన్ని వర్గాల ప్రేక్షకులను మాత్రమే మెప్పిస్తుంది. బీ,సీ సెంటర్లలో ఓ బేబీ చిత్రానికి వసూళ్లు సాధించడం కొంచెం కష్టమే అని చెప్పాలి. ఇక మల్టీప్లెక్స్‌, ఏ సెంటర్ల ఆడియెన్స్ ఈ మూవీని చూసేందుకు ఇష్టపడతారు.

నటీనటుల పర్ఫార్మెన్స్:
ఓ బేబీ చిత్రాన్ని ఒంటిచేత్తో లాక్కొంచింది అందాల భామ సమంత. తన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్‌తో ఫ్యాన్స్‌ను ఆమె పూర్తిగా ఇంప్రెస్ చేసింది. రాజేంద్ర ప్రసాద్‌తో సమంత కనిపించిన ప్రతి సీన్ ప్రేక్షకులను అలరిస్తుంది. ఇక ఎమోషన్ సీన్స్‌లోనూ సమంత మరోసారి ప్రూవ్ చేసుకుంది. లేడీ ఓరియెంటెడ్ మూవీ కావడంతో ఈ సినిమాలో రావు రమేష్, నాగశౌర్య, తదితరులు పెద్దగా కనిపించరు. మిగతా నటీనటులు తమ పరిధిమేర ఓకే అనిపించారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
కేవలం ఓ ఎమోషన్ డ్రామాతో లేడీ ఓరియెంటెడ్ మూవీని తెరకెక్కించిన దర్శకురాలు నందిని రెడ్డికి పూర్తిగా మార్కులు వేయాలి. తాను ఏదైతే చూపించాలనుకుందో అది అనుకున్నట్లుగా ప్రెజెంట్ చేసిన విధానం బాగుంది. ఓ సాధారణ కథను చిన్న ట్వి్స్టుతో తెరకెక్కించిన నందిని రెడ్డి కొన్ని చోట్ల తడబడింది. సినిమాకు మేజర్ అసెట్ సినిమాటోగ్రఫీ అని చెప్పాలి. ప్రతి ఫ్రేం చాలా బాగా చూపించారు. కాగా సినిమాకు సంగీతం మైనస్ అని చెప్పాలి. ఒకటి రెండు పాటలు మినహా మిక్కీ జే మేయర్ సంగీతం ఎక్కడా ఆకట్టుకోలేకపోయింది. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా:
ఫ్యామలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న ‘ఓ బేబీ’!

రేటింగ్:
3.0/5.0