fbpx
HEALTH NEWS

ఎట్టకేలకు కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కనుకున్న అమెరికా.

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను క్రమంగా కమ్మేస్తోంది. కరోనా దెబ్బకు ప్రపంచం విలవిలలాడుతోంది. దాన్ని నియంత్రించటానికి ఆయా దేశాలు హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నాయంటే కరోనా తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. భారత్ లోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. 110 కేసులు నమోదయ్యాయి. కరోనాను డబ్ల్యూహెచ్ వో మహమ్మారిగా గుర్తించింది. మన దేశం కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించింది. అయితే ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నివారణకు వీలుగా అమెరికా కొత్తగా వ్యాక్సిన్‌ను కనుగొంది.

అమెరికాలోని సీటెల్ నగరంలోని కైజర్ పర్మినెంట్ వాషింగ్టన్ హెల్త్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో కరోనా వైరస్ వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలు సోమవారం ప్రారంభించారు. కరోనా వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షల కోసం అమెరికా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నిధులు సమకూర్చింది. కరోనా వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలు పూర్తి చేసి పూర్తిగా ధ్రువీకరించడానికి ఏడాది నుంచి 18 నెలల సమయం పడుతుందని అమెరికా ప్రజారోగ్యశాఖ అధికారులు చెప్పారు. కరోనా వ్యాక్సిన్‌ను ఆరోగ్యంగా ఉన్న 45 మంది యువ వాలంటీర్లకు ఇచ్చి పరీక్షించనున్నారు.

ఈ కరోనా టీకాల వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని అమెరికా శాస్త్రవేత్తలు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో పలు దేశాల పరిశోధనా బృందాలు దీని నివారణకు వ్యాక్సిన్ ను కనుగొనేందుకు యత్నిస్తున్నాయి.సంప్రదాయక టీకాల కన్నా శక్తివంతమైన వ్యాక్సిన్ ను కనుగొనేందుకు శాస్త్రవేత్తలు శ్రమిస్తున్నారు.

అయితే అమెరికా శాస్త్రవేత్తలు అందరికంటే ముందుగా కరోనా వ్యాక్సిన్ ను కనుగొని క్లినికల్ పరీక్షలు సోమవారం ప్రారంభించారు. కరోనా వైరస్ రోగులు దగ్గు, జలుబు, జ్వరం, నిమోనియాలతో బాధపడుతున్నందున వారికి సోకకుండా ముందుజాగ్రత్తగా వ్యాక్సిన్ కనుగొనేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు. తేలికపాటి అనారోగ్యంతో బాధపడుతున్నవారు సాధారణంగా రెండు వారాల్లో కోలుకుంటారు, అయితే మరింత తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారు కోలుకోవడానికి మూడు వారాల నుంచి ఆరు వారాల సమయం పట్టవచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ వైద్యనిపుణులు చెపుతున్నారు.