fbpx
NEWS

తమ ఊరిలో పిల్లలను కనేవారికి పారితోషికంగా

ప్రపంచ జనాభా పెరిగిపోతున్నదని కొన్ని దేశాలు ఆందోళన చెందుతుంటే… మరికొన్ని దేశాలు తమ దేశంలో జననాల రేటు విపరీతంగా పడిపోతున్నదని తెగ బాధపడుతున్నాయి. జనాభా సంఖ్యను పెంచేందుకు ఓ దేశంలో వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టారు. జనాభాలోని యువత శాతం తగ్గడంతో అక్కడి అధికారులు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. పిల్లల్ని కనే జంటలకు సరికొత్త ఆఫర్‌ను అందిస్తున్నారు. ఫిన్‌లాండ్‌లోని ఓ ఊరిలో జనాభా భారీగా తగ్గిపోతున్నది. పరిస్థితి అలాగే కొనసాగితే, కొన్నేండ్లకు యువత లేకుండా వృద్ధులే మిగిలిపోయే ప్రమాదం ఉన్నది.

 

ఆ సమస్యకు పరిష్కారం చూపేందుకు స్థానిక పాలకవర్గం ఒక ఆలోచన చేసింది. తమ ఊరిలో పిల్లలను కనేవారికి పారితోషికంగా 10,000 యూరోలు (భారత కరెన్సీలో రూ.7,87,270) ఇవ్వాలని నిర్ణయించింది. 725 మంది జనాభా ఉన్న ఆ ఊరిలో 2012లో ఒక్క శిశువు మాత్రమే జన్మించింది. దాంతో పిల్లలను కనేందుకు ప్రజలను ప్రోత్సహించాలన్న ఆలోచనతో మున్సిపాలిటీ ఈ వినూత్న పథకాన్ని ప్రవేశ పెట్టింది. పశ్చిమ ఫిన్‌లాండ్ ప్రావిన్సులో ఉన్న అతి చిన్న మున్సిపాలిటీ లెస్టిజార్విలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.

పిల్లలను కనేందుకు ప్రజలను ప్రోత్సహించాలన్న ఆలోచనతో 2013లో బేబీ బోనస్ పేరుతో పథకం ప్రవేశపెట్టారు. దీని కింద ఇక్కడ బిడ్డకు జన్మనిచ్చిన ప్రతి జంటకూ పై మొత్తం పారితోషికం అందిస్తారు. ఆ మొత్తాన్ని ఏటా 1,000 యూరోల (రూ.79029) చొప్పున 10 ఏండ్ల పాటు చెల్లిస్తారు. ఈ పథకం ప్రారంభించిన తర్వాత ఏడేండ్లలో ఇక్కడ 60 మంది పిల్లలు జన్మించారు. అంతకు ముందు ఏడేండ్లలో 38 మంది మాత్రమే జన్మించారు. బేబీ బోనస్ పథకం అమలు జరిగిన తర్వాత జనాల్లో పిల్లల్ని కనాలనే ఆసక్తి పెరిగింది.

ఈ పథకం కింద మొదటిసారిగా లబ్ధి పొందిన జుక్కా పెక్కా టుయిక్కా, జనికా దంపతులు ఇప్పుడు చిన్న వ్యవసాయ ఆధారిత పరిశ్రమ నడుపుతున్నారు. ఈ జంటకు 2013లో అమ్మాయి పుట్టింది. విశేషం ఏమిటంటే, ఆ చిన్నారిని అందరూ ముద్దుగా టెన్ థౌజండ్ యూరో గర్ల్ అని పిలుస్తున్నారు. ఈ ఊరిలోని ఫలితాలను చూసిన తర్వాత, ఫిన్‌లాండ్‌లోని ఇతర మున్సిపాలిటీలు బేబీ బోనస్ వంటి పథకాలను ప్రవేశపెడుతున్నాయి.

ఇటువంటి నగదు ప్రోత్సాహకాలతో జననాల రేటును పెంచవచ్చునని ఇటలీలో ఇటీవల ఒక అధ్యయనంలో వెల్లడయింది. ఇటలీలో జననాల రేటు కొన్ని దశాబ్దాలుగా చాలా తక్కువగా నమోదవుతున్నది. 2018లో కనిష్ట స్థాయికి పడిపోయింది. అదే ఇటలీలో జననాల రేటును పెంచేందుకు మెరుగైన ప్రోత్సాహకాలు అందిస్తున్న ఒక్క ప్రావిన్సులో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉన్నది. స్విట్జర్లాండ్ సరిహద్దులో ఉన్న బోల్జానో ప్రావిన్సులో జననాల రేటు 1.67గా ఉంది. ఇక్కడ కుటుంబ విధానాలు ఇటలీలోని ఇతర ప్రాంతాల కంటే చాలా మెరుగ్గా ఉండటమే అందుకు కారణమని చెప్పొచ్చు. ఇక్కడ నెలనెలా చిన్నారులకు ఆర్థిక ప్రయోజనం అందిస్తున్నారు. అల్పాదాయ కుటుంబాలకు అక్కడి ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు కూడా కల్పిస్తున్నది.

జననాల రేటును పెంచేందుకు స్థానిక పాలక సంస్థలు ఇలాంటి ప్రోత్సహకాలు ఇస్తున్నా ఇప్పటికీ ఫిన్‌లాండ్ జాతీయ జననాల రేటు అత్యంత తక్కువగా ఉంటున్నది. మిగతా యూరోపియన్ దేశాల మాదిరిగానే, గడిచిన దశాబ్ద కాలంలో ఫిన్‌లాండ్‌లో జననాల రేటు దారుణంగా పడిపోయింది. 2018లో ప్రతి మహిళకు నలుగురు పిల్లలు ఉండేవారు. అంతకు ముందు పదేండ్ల క్రితం ఈ రేటు 1.85గా ఉండేది. ఫిన్‌లాండ్‌లో జననాల పెరుగుదల, పిల్లల పోషణకు సంబంధించి ప్రోత్సాహకరమైన పథకాలు చాలానే ఉన్నాయి.

బేబీ బాక్స్‌ల పంపిణీతోపాటు ఒక్కో చిన్నారికి నెలనెలా దాదాపు 100 యూరోలు (రూ. 7,865) ఇస్తున్నారు. ఉద్యోగం చేసే మహిళలకు 70 శాతం వేతనంతో కూడిన 9 నెలల ప్రసూతి సెలవులు అమలు చేస్తున్నారు. బేబీ బోనస్ పథకం వల్ల కొంతమందిలో పిల్లలను కనాలన్న ఆసక్తి పెరిగింది. గతంలో చాలామంది గ్రామాలను వదిలి పట్టణాలకు వలస వెళ్లి అక్కడే స్థిరపడేవారు. ఇప్పుడు ఈ ప్రోత్సాహకాల వల్ల వలస వెళ్లేవారి సంఖ్య తగ్గింది.