fbpx
NEWS

హిమాల‌యాల్లో భారీ మంచుమ‌నిషి.. ఆన‌వాళ్లు గుర్తించిన ఇండియ‌న్ ఆర్మీ

భార‌తీయ సైనికులు భారీ మంచు మ‌నిషి అడుగుల్ని గుర్తించారు. ఆర్మీకి చెందిన ప‌ర్వ‌తారోహ‌కులు ఆ భారీ మంచుమ‌నిషి అడుగుల‌ను హిమాల‌యాల్లో ప‌సిక‌ట్టారు. దానికి సంబంధించిన ఫోటోల‌ను కూడా ఇండియ‌న్ ఆర్మీ ట్వీట్ చేసింది. హిమాల‌యాల మంచుపై య‌తి అడుగులు ఉన్న‌ట్లు ఆర్మీ వెల్ల‌డించింది. హిమాల‌య దేశాల్లో పురాణాల ప్ర‌కారం య‌తి ఓ భారీ మంచు మ‌నిషి. నేపాల్‌, టిబెట్‌, భార‌త్‌తో పాటు సైబీరియా మంచు ప్రాంతాల్లో అతిభారీ పాదాలు క‌లిగిన రాకాసి జీవులు ఉన్న‌ట్లు కొన్ని పురాణ క‌థ‌లు చెబుతున్నాయి.

ఆ క‌థ‌ల ప్ర‌కారం.. రాకాసి య‌తి అడుగు ఒక్క‌టి 32×15 ఇంచులు ఉంటుంది. నేపాల్‌లోని మ‌కాలు బారున్ జాతీయ పార్క్ వ‌ద్ద ఈ ఆన‌వాళ్ల‌ను గుర్తించిన‌ట్లు తెలుస్తోంది. అయితే య‌తి అడుగుల‌ను ట్వీట్ చేసిన ఇండియ‌న్ ఆర్మీ.. ఆ భారీ మంచుమ‌నిషికి సంబంధించిన మ‌రిన్ని చిత్రాల‌ను, వీడియోల‌ను ఇవాళ మ‌ళ్లీ పోస్టు చేయ‌నున్నారు. య‌తి మంచుమ‌నిషికి సంబంధించిన వాస్త‌విక ఆధారాలు ఉన్నాయ‌ని, ప్ర‌త్య‌క్ష‌సాక్షులు కూడా ఉన్న‌ట్లు ఆర్మీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

నేపాలీ జాన‌ప‌థ క‌థ‌ల ప్ర‌కారం.. య‌తి ఓ భారీ ఆకారం క‌లిగిన జీవి. అదొక అడ‌వి జంతువు ఏప్ త‌ర‌హాలో ఉంటుంది. ఇది కేవ‌లం హిమాల‌యాలతో పాటు మ‌ధ్య ఆసియా, సైబీరియా ప్రాంతాల్లో జీవిస్తుంది. ప‌ది రోజుల క్రితం య‌తికి సంబంధించిన ఆధారాలు దొరికిన‌ట్లు తెలుస్తోంది. మంచుపై ఉన్న య‌తి అడుగుల ఆధారాల‌ను ఫోటోలు తీసిన సైనికులు.. వాటిని ఆ స‌బ్జెక్ట్ నిపుణుల‌కు పంపారు. సాధార‌ణంగా య‌తిని ఓ మంచుమ‌నిషిగా భావిస్తారు. ఆదికాల‌పు మంచు మ‌నిషిగా య‌తిని గుర్తిస్తారు. అతిభారీ శ‌రీర ఆకారంతో భ‌యం పుట్టించే రీతిలో ఉంటాడు.

You may also like